: బెంగళూరు ఎయిర్ పోర్టులో ఇళయరాజాకు చేదు అనుభవం!
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు బెంగళూరు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. మంగళూరులోని కొన్ని దేవాలయాలను దర్శించుకునేందుకు వెళ్లిన ఇళయరాజా కుటుంబం తిరిగి చెన్నై చేరుకునేందుకు ఆదివారం కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సెక్యూరిటీ అధికారులు ఇళయరాజాను, ఆయన బ్యాగును స్కానర్ వద్ద నిలిపివేసి పూర్తిగా తనిఖీ చేశారు. ఆయన బ్యాగ్ లో కొబ్బరిచిప్పల ప్రసాదం ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో, అవమానం ఫీలయిన ఆయన తనయుడు కార్తీక్ రాజా సెక్యూరిటీతో వాగ్వివాదానికి దిగాడు. దీనికితోడు, కార్తీక్ రాజా తన మొబైల్ ద్వారా అక్కడి సెక్యూరిటీ అధికారి ఫొటోలను తీయడంతో మరింత వివాదానికి దారి తీసింది. ఆ ఫొటోలను మొబైల్ నుంచి తొలగించే వరకు అధికారి ఊరుకోలేదు. తర్వాత అక్కడే వున్న ఒక టీవీ జర్నలిస్టు కల్పించుకుని 'ఆయన ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా' అని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. తర్వాత కాస్త ఆలస్యంగా బయలుదేరిన విమానంలో ఇళయరాజా కుటుంబం చెన్నయ్ వెళ్లింది.