: కేసీఆర్ సర్కార్ తో కోదండరాంకు ప్రాణహాని ఉంది: ఓయూ జేఏసీ
టీజేఏసీ చైర్మన్ కోదండరాంకు కేసీఆర్ ప్రభుత్వంతో ప్రాణహాని ఉందని, ఆయనకు కేంద్రం రక్షణ కల్పించాలని ఓయూ జేఏసీ డిమాండ్ చేసింది. కోదండరాంపై ఉద్యమ ద్రోహి అని ముద్ర వేయడం తగదని జేఏసీ నేతలు దరువు ఎల్లన్న, మందాల భాస్కర్ తదితరులు మండిపడ్డారు. ఉద్యమ ద్రోహులైన తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి లాంటి మంత్రులతో కోదండరాంపై విమర్శలు చేయించడం తగదని అన్నారు. రెండేళ్ల టీఆర్ఎస్ పాలనలో లోపాలను వేలెత్తి చూపించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న కేసీఆర్, తమ మంత్రులు, ఎంపీలతో కోదండరాంపై విమర్శలు చేయిస్తున్నారని, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వారిని కించపరుస్తున్నారని వారు మండిపడ్డారు.