: తెలంగాణ వచ్చిన తరువాతయినా ప్రజల సమస్యలు తీరట్లేదు: కోదండ రామ్ ఆవేదన
తెలంగాణ వచ్చిన తరువాత కూడా ప్రజల సమస్యలు తీరట్లేదని ప్రొఫెసర్ కోదండరామ్ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఆదిలాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై జేఏసీ సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. టీఆర్ఎస్ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై, ప్రజా సమస్యలపై రేపు జరగనున్న జేఏసీ సమావేశంలో చర్చించి, ఓ నిర్ణయానికి రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశం తరువాత ప్రభుత్వ నేతలకు సమాధానం చెబుతానని కోదండరామ్ అన్నారు. తాము 30 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఏ ఒక్కరి ఒత్తిడి మేరకో జేఏసీ పనిచెయ్యదని ఆయన అన్నారు. అభివృద్ధి అనే లక్ష్యాన్ని సాధించాలని తెలంగాణ కోసం పోరాడామని ఆ కల నెరవేరేవరకు ఉద్యమిస్తూనే ఉంటామని ఆయన ఉద్ఘాటించారు.