: వ్యాన్ దిగకుండా భీష్మించుకున్న ముద్రగడ!
ఈ మధ్యాహ్నం ముద్రగడను బలవంతంగా నేరస్తులను తరలించే పోలీసు వ్యాన్ లోకి ఎక్కించి, అమలాపురం నుంచి అటూ ఇటూ తిప్పి, కిర్లంపూడిలోని ఆయన ఇంటికి తీసుకువెళ్లి దించాలని చూసిన ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులతో ఆయన వాగ్వాదానికి దిగారు. పోలీసు వ్యాన్ ను తాను దిగబోనని స్పష్టం చేసిన ముద్రగడతో దానిలోనే అధికారులు చర్చలు జరుపుతున్నారు. అరెస్ట్ చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని లేకుంటే తనను అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని ఆయన డిమాండ్ చేస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పోలీసులు ఉన్నారు. తనను బలవంతంగా వ్యాన్ నుంచి దించితే, మరోసారి స్టేషన్ ను ముట్టడిస్తానని ఆయన హెచ్చరించినట్టు తెలుస్తోంది. కేసులో నిందితులుగా ఉన్నవారి జాబితాను తనకిస్తే, తానే స్వయంగా వారిని స్టేషనులో అప్పగిస్తానని, అమాయకులను భయాందోళనలకు గురిచేస్తే మాత్రం ఊరుకునేది లేదని ముద్రగడ డీఎస్పీలతో వాదనలకు దిగారు. ముద్రగడతో చర్చల సారాంశాన్ని ఎస్పీకి తెలిపిన అధికారులు, ఆయన్నుంచి వచ్చే సమాచారం కోసం ప్రస్తుతం వేచి చూస్తున్నారు.