: ఫేస్ బుక్ ఇండియా చీఫ్ గా ఉమంగ్ బేడీ!... ఇక అమెరికా పయనం కానున్న కార్తీక రెడ్డి!
సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్ బుక్’... తన ఇండియా చీఫ్ గా ఉమంగ్ బేడీని నియమించుకుంది. ఈ మేరకు ఆయన ఎంపికను ఫేస్ బుక్ యాజమాన్యం ధ్రువీకరించింది. మొన్నటిదాకా ఫేస్ బుక్ ఇండియా కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న కార్తీక రెడ్డి నుంచి ఆయన త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. మొన్నటిదాకా ‘అబోడ్’లో దక్షిణాసియా ప్రాంతానికి మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి ఫేస్ బుక్ లో చేరిపోయారు. ఇదిలా ఉంటే... ‘ఫ్రీ బేసిక్స్’ దెబ్బకు ఫేస్ బుక్ ఇండియా చీఫ్ పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్న కార్తీక రెడ్డికి... ఉమంగ్ బేడీ నియామకంతో మార్గం సుగమమైంది. ఉమంగ్ బేడీకి బాధ్యతలు అప్పగించిన వెంటనే కార్తీక రెడ్డి అమెరికాలోని ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిపోతారు.