: 30 శాతం హెచ్ఆర్ఏపై ఉత్తర్వులు జారీ!... ఆనంద డోలికల్లో ఏపీ సచివాలయ ఉద్యోగులు!
అమరావతికి తరలివచ్చే ఉద్యోగులకు ఇవ్వనున్న 30 శాతం హెచ్ఆర్ఏకు సంబంధించిన జీవోను ఏపీ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. అమరావతికి ఏపీ సచివాలయ ఉద్యోగులు తరలివెళ్లేందుకు ప్రభుత్వం నిర్దేశించిన గడువు (ఈ నెల 27) సమీపిస్తున్న తరుణంలో నిన్న ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్ బాబుతో పాటు గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు నిరసన గళం విప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గతంలో 30 శాతం హెచ్ఆర్ఏను ప్రకటించిన ప్రభుత్వం దానికి సంబంధించిన ఉత్తర్వులను మాత్రం విడుదల చేయలేదు. అయితే నిరసన గళం వినిపించిన ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకే ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం సదరు ఆఫర్ కు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. జీవో జారీ కావడంతో సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.