: ఇండియాకు కొత్తగా వచ్చిన మరో చిన్న కారు... ధర రూ. 2.39 లక్షలు
ఆకర్షణీయమైన ధరలో మరో చిన్న కారు భారత మార్కెట్లోకి దూసుకొచ్చింది. డాట్సన్ సంస్థ 'రెడీ గో' పేరిట రూ. 2.39 లక్షల (ఎక్స్ షోరూం, న్యూఢిల్లీ) ధరలో ఐదు వేరియంట్లలో కారును నేడు విడుదల చేసింది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 3.34 లక్షలని తెలిపింది. గతంలో గో, గో ప్లస్ కార్లను విడుదల చేసి అంతగా ఆకట్టుకోలేకపోయిన డాట్సన్, భారత మార్కెట్ సరళిని ఆకళింపు చేసుకుని ఇక్కడి మార్కెట్ కు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ కారును తయారు చేసినట్టు తెలుస్తోంది. రినాల్ట్ క్విడ్ రూపొందిన సీఎంఎఫ్-ఏ ప్లాట్ ఫాంపైనే ఈ కారు కూడా తయారైంది. మరింత పెద్దదిగా కనిపించే ఫ్రంట్ గ్రిల్, లోపలివైపున వెండి రంగులో డ్యాష్ బోర్డు, ఆకు ఆకారంలోని హెడ్ లైట్లు కారును ఆకర్షణీయం చేస్తాయని భావిస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఐదు వేర్వేరు రంగుల్లో లభించే కారులో 799 సీసీ త్రీ సిలిండర్ యూనిట్ ఇంజన్, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ గేర్లు, లీటరుకు 25 కేఎంపీఎల్ మైలేజీ లభిస్తుందని పేర్కొన్నారు. గత నెలలోనే బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, డెలివరీలను వెంటనే ప్రారంభిస్తున్నామని వివరించారు. కాగా, ఈ కారు మారుతి సుజుకి ఆల్టో 800, హ్యుందాయ్ ఇయాన్, రినాల్ట్ క్విడ్ కార్లకు గట్టి పోటీ ఇస్తుందని అంచనా. రెడీ గో డీ వేరియంట్ రూ. 2.39 లక్షలు, ఏ వేరియంట్ 2.82 లక్షలు, టీ వేరియంట్ రూ. 3.09 లక్షలు, టీ(ఓ) వేరియంట్ రూ. 3.19 లక్షలు, ఎస్ వేరియంట్ రూ. 3.34 లక్షలని సంస్థ తెలిపింది.