: సినీ నటుడిని కిడ్నాప్ చేసిన హోంగార్డు, టీవీ జర్నలిస్టు!... అరెస్ట్ చేసిన పోలీసులు!
హైదరాబాదులో గత నెల 31న సినీ నటుడు కాలె శ్రీనివాసరావు కిడ్నాప్ అయ్యాడు. రూ.2 లక్షలిస్తే శ్రీనివాసరావును వదిలేస్తామంటూ అతడి కుటుంబానికి ఫోన్ చేసిన కిడ్నాపర్లు బేరసారాలకు తెర తీశారు. కిడ్నాపర్ల డిమాండ్లకు తలొగ్గని శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. కిడ్నాప్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు. అయితే నిఘా వర్గాలకు చిక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటూ కిడ్నాపర్లు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. అయితే శ్రీనివాసరావు ఇంటికి కిడ్నాపర్ల నుంచి వచ్చిన ఫోన్ నెంబరు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కిడ్నాపర్ల వివరాలు తెలుసుకుని షాకయ్యారు. సీఐడీ విభాగంలో పనిచేస్తున్న హోంగార్డు జలీల్, స్టూడియో9 ఛానెల్ లో రిపోర్టర్ గా పనిచేస్తున్న జగదీశ్వర్... శ్రీనివాసరావును కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నిందితుల ఆచూకీ కనిపెట్టిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఇక కిడ్నాపైన శ్రీనివాసరావును వారు ఎక్కడ ఉంచారన్న వివరాలను పోలీసులు వారి నుంచి సేకరిస్తున్నారు.