: అమలాపురానికి తరలివస్తున్న కాపులు!... భారీగా మోహరించిన పోలీసులు!


కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమం మొదలుపెట్టిన కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కారణంగా ప్రశాంతంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మొన్న కాపు ఐక్య గర్జనతో తునిలో విధ్వంసం జరిగింది. తాజాగా సదరు ఘటనకు సంబంధించి పోలీసులు అరెస్టుల పర్వానికి తెర తీయడంతో అదే జిల్లాలోని అమలాపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తప్పేలా లేవు. తునిలో విధ్వంసానికి బాధ్యులుగా చెబుతూ నిన్న రాత్రికే పోలీసులు ఆరుగురు కాపు యువకులను అదుపులోకి తీసుకున్నారు. విషయం కాస్తం ఆలస్యంగా తెలుసుకున్న ముద్రగడ... నేడు తెల్లవారగానే రంగంలోకి దిగిపోయారు. తన సొంతూరు కిర్లంపూడి నుంచి నేరుగా అమలాపురం చేరుకున్న ఆయన... తుని ఘటనకు కర్త, కర్మ, క్రియ మొత్తం తానేనని పోలీసులకు చెప్పారు. కేసులో ఏ1గా తన పేరును నమోదు చేసి తనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అమలాపురం పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న హైడ్రామా తెలుసుకున్న కాపు యువకులు జిల్లా నలుమూలల నుంచి అమలాపురానికి బయలుదేరారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కాపులు అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. ఇక పొరుగు జిల్లాలకు చెందిన కాపులు కూడా అమలాపురానికి బయలుదేరినట్లు సమాచారం. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ముందు జాగ్రత్త చర్యల కింద పెద్ద సంఖ్యలో బలగాలను అక్కడ మోహరించారు. ఇప్పటికే అక్కడ కొంత మంది పోలీసులు భద్రతా విధుల్లోకి దిగిపోగా, ఇతర జిల్లాల నుంచి కూడా అక్కడికి బలగాలు బయలుదేరినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News