: ఈదురు గాలులకు చిరిగిన అతిపెద్ద జాతీయ పతాకం
హైదరాబాద్, నెక్లెస్ రోడ్డులో 300 అడుగుల ఎత్తున సగర్వంగా ఎగురుతూ, చూపరులను ఎంతగానో ఆకర్షిస్తున్న ఇండియాలోనే అత్యంత ఎత్తయిన జాతీయ పతాకం, నిన్నటి ఈదురుగాలులకు చిరిగిపోయింది. తెలంగాణ ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా జరుపుకుంటున్న ఉత్సవాలు శాశ్వతంగా నిలిచిపోవాలన్న ఉద్దేశంతో దీన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే, ఇది నాలుగు రోజులకే దెబ్బతినగా, నిబంధనల ప్రకారం, దాన్ని కిందకు దించిన అధికారులు మరో పతాకాన్ని ఎగురవేశారు. కాగా, ఇంత ప్రతిష్ఠాత్మకమైన జెండా తయారీకి నాణ్యమైన మెటీరియల్ వాడలేదన్న విమర్శలు ఒకవైపు వస్తుండగా, గాలుల తీవ్రత పెరిగినందునే జెండా దెబ్బతిన్నదని, ఇటువంటి ఘటనలు జరిగితే మార్చాలన్న ఉద్దేశంతో ఐదు జెండాలను సిద్ధంగా ఉంచుకున్నామని అధికారులు తెలిపారు.