: ప్రకాశం జిల్లాలో దారి దోపిడీ!... ఖాకీలను చూసి కారులో పరారైన దొంగలు!
ప్రకాశం జిల్లాలో దోపిడీ దొంగల స్వైర విహారం కలకలం రేపుతోంది. ఓ కారులో దర్జాగా రంగంలోకి దిగిన దోపిడీ దొంగలు... రోడ్డుపై వెళుతున్న లారీలే లక్ష్యంగా దోపిడీకి పాల్పడ్డారు. జిల్లాలోని సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్ద నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు వేగంగానే స్పందించారు. గుట్టుగా లారీలను ఆపేసిన దొంగలు డ్రైవర్ల వద్ద ఉన్న నగదును లాగేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా... పోలీసుల వాహనాన్ని చూసిన దొంగలు వచ్చిన కారులోనే క్షణాల్లో మాయమయ్యారు. బాధిత లారీ డ్రైవర్ల నుంచి సమాచారం సేకరించిన పోలీసులు దొంగల కోసం వేట మొదలుపెట్టారు.