: రూ. 25 లక్షలు లంచం ఆఫర్ చేసిన గోల్డ్ మాఫియా: కేరళ న్యాయమూర్తి సంచలన ఆరోపణ
తమకు అనుకూలమైన తీర్పు కావాలని కేరళ హైకోర్టు న్యాయమూర్తికి గోల్డ్ మాఫియా రూ. 25 లక్షల ఆఫర్ చేసింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా కోర్టుకు డిక్లరేషన్ రూపంలో తెలియజేశారు. ఓ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులకు సంబంధించి అతను తనకు ఈ ఆఫర్ ఇచ్చాడని ఆయన డివిజన్ బెంచ్ ముందు వెల్లడించారు. ఫెమా చట్టం కింద నిందితులపై ఆరోపణలు ఉండగా, కేసు తన వద్ద విచారణ జరుగుతోందని తెలిపిన జస్టిస్ కేటీ శంకరన్, లంచం ఆఫర్ గురించి తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి 2 వేల కిలోల బంగారం స్మగ్లింగ్ కు సంబంధించిన కేసు ఇదని, విమానాశ్రయ సిబ్బంది, ఇమిగ్రేషన్ అధికారులు ఇందులో నిందితులని గుర్తు చేశారు. మొత్తం 9 మందిని ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో నిందితుల్లో చేర్చగా, ఒక్కరు మినహా మిగతా వారంతా తిరువనంతపురం జైలులో ఉన్నారని చెప్పారు. గత సంవత్సరం మేలో కేసు వెలుగులోకి వచ్చిందని, ప్రత్యేక బృందాలు, కస్టమ్స్ అధికారులు కేసును ఛేదించారని తెలిపారు. వీరిని నిర్దోషులుగా ప్రకటించాలని కోరుతూ తన వద్ద బేరాలు సాగించారని చెప్పారు. కాగా, జస్టిస్ శంకరన్ ఆరోపణలపై కేరళ హైకోర్టు విచారణకు ఆదేశించింది.