: ఇక అధికారికం... ట్రంప్ తో తలపడనున్న హిల్లరీ... నామినేషన్ ఖరారు


అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారెవరన్న విషయమై సందిగ్ధత వీడింది. ఇప్పటికే రిపబ్లికన్ల తరఫున డొనాల్డ్ ట్రంప్ తన పేరును ఖరారు చేసుకుని ప్రచారంలో దూసుకెళుతుండగా, డెమోక్రాట్ల తరఫున నామినేషన్ ను మాజీ ఫస్ట్ లేడీ హిల్లరీ క్లింటన్ దక్కించుకున్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వానికి సరిపడా మద్దతుదారుల ఓట్లను ఆమె దక్కించుకున్నారని అసోసియేటెడ్ ప్రెస్, యూఎస్ నెట్ వర్క్ వార్తా సంస్థలు ప్రత్యేక కథనాలను ఇచ్చాయి. అమెరికాలో వైట్ హౌస్ లో మకాం వేసేందుకు ప్రధాన పార్టీ నుంచి పోటీపడుతున్న తొలి మహిళగా ఆమెను అభివర్ణించాయి. ప్రాథమిక ఎన్నికల్లో ఆమెకు 2,383 మంది ఓట్లు లభించాయని తెలిపాయి. ఈ వార్తలను చూసిన క్లింటన్ తన ఆనందాన్ని ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఇంకా కొన్ని ప్రైమరీలు మిగిలి ఉండగానే ఈ వార్తలు వెలువడటం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు. కాగా, హిల్లరీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న శాండర్స్ మాత్రం ఇంకా తన ఓటమిని అంగీకరించలేదు. జూలైలో జరిగే పార్టీ సదస్సు వరకూ తాను పోటీలో ఉన్నట్టేనని ఆయన అన్నారు. "దురదృష్టవశాత్తూ మీడియా ముందుగానే విజేతలను ప్రకటించేసింది. డెమోక్రాట్ల నేషనల్ కమిటీ సూచించినట్టుగా సూపర్ డెలిగేట్ల ఓట్లను వారు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ వేసవిలో జరిగే సదస్సులో వారూ ఓటేస్తారన్న విషయాన్ని మరిచారు" అని శాండర్స్ ప్రతినిధి మైఖేల్ బ్రిగ్స్ ఓ ప్రకటనలో ఆరోపించారు. కాగా, సూపర్ డెలిగేట్స్ ఓట్లలో 561 మంది హిల్లరీ వైపుండగా, శాండర్స్ వెనుక కేవలం 47 మంది మాత్రమే ఉన్నట్టు సీఎన్ఎన్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News