: కాంగ్రెస్ కు మరో ఎదురు దెబ్బ!... సీనియర్ నేత గురుదాస్ కామత్ రాజీనామా!


కాంగ్రెస్ పగ్గాలు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బదిలీ కానున్న కీలక తరుణంలో ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ కీలక నేత అజిత్ జోగి పార్టీకి రాజీనామా చేసి సొంత కుంపటి ఏర్పాటు చేసుకునే యత్నాల్లో ఉన్నారు. తాజాగా పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గురుదాస్ కామత్ కూడా చేయిచ్చారు. ఈ మేరకు నిన్న ముంబైలో ఆయన కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించిన గురుదాస్... ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగిన తాను కొత్తగా వచ్చిన వారికి స్థానం కల్పించేందుకే పక్కకు తప్పుకుంటున్నట్లు గురుదాస్ చెప్పారు. ఈ విషయాన్ని పది రోజుల క్రితమే పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి చెప్పానని, ఆ వెంటనే సోనియాతో పాటు రాహుల్ గాంధీకి కూడా తన రాజీనామా లేఖలను అందించానని ఆయన చెప్పారు. తన రాజీనామా లేఖలకు ఎలాంటి స్పందన రాని నేపథ్యంలోనే తాను ఈ ప్రకటన చేస్తున్నానని కామత్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News