: వాళ్లు వెళ్లారని... మనమూ వెంటనే వెళ్లాలా?: దేవినేనికి ఝలక్కిచ్చిన చంద్రబాబు


కృష్ణా నది జలాల యాజమాన్య బోర్డు విషయంలో తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల మధ్య నెలకొన్న వివాదం తారస్థాయికి చేరుకుంది. ఏపీ వాదనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిన్న సాగునీటి శాఖాధికారులు, కొందరు ప్రజా ప్రతినిధులతో కలిసి ఢిల్లీ వెళ్లిన తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో భేటీ అయ్యారు. కృష్ణా నదిపై తాము నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవద్దని ఆయన కోరారు. ఓ వైపు ఢిల్లీలో హరీశ్ రావు పర్యటన కొనసాగుతుండగానే... విజయవాడలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు జలవనరుల శాఖతో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఆ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు ఆ శాఖాధికారులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘మనమూ ఢిల్లీ వెళదాం. కేంద్రానికి ఫిర్యాదు చేద్దాం’ అంటూ దేవినేని వాదించారు. అయితే మంత్రి వాదనకు ససేమిరా అన్న చంద్రబాబు ‘‘వాళ్లు వెళ్లారని, మనమూ వెంటనే వెళ్లాలా? కొద్దిగా గ్యాప్ తీసుకుని వెళదాం. అలా అయితేనే ప్రయోజనం ఉంటుంది. ఈలోగా కేంద్రంతో టచ్ లో ఉందాం’’ అని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News