: ముస్లింలపై చైనా రంజాన్ ఆంక్షలు!


చైనాలో ముస్లిం జనాభా అధికంగా ఉండే క్సింజియాంగ్ ప్రాంతంపై సరికొత్త ఆంక్షలను విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు, మైనర్లు ఉపవాసాలు ఉండరాదని, ఈ ప్రాంతంలోని అన్ని రెస్టారెంట్లనూ పగలు తెరచే ఉంచాలని ఆదేశించింది. ఈ ప్రాంతంలో దాదాపు కోటి మంది యుగిర్ వర్గానికి చెందిన ముస్లింలు ఉండగా, పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయిన వేళ ఈ ఆంక్షలను విధించడం గమనార్హం. దేశ భద్రతా దళాలు, యుగిర్ వర్గ ప్రజలకు నిత్యమూ ఘర్షణలు జరుగుతుండే ఈ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించి స్వాతంత్ర్యం ఇవ్వాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, సహజ వనరులు పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేని చైనా సర్కారు, క్సింజియాంగ్ పై పట్టును కోల్పోయేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదు. కాగా, రంజాన్ ఉపవాసాలను నిషేధిస్తున్నట్టు స్థానిక ప్రభుత్వ అధికారులు పలు ప్రాంతాల్లో నోటీసులు పెట్టి, వెబ్ సైట్ల ద్వారా ప్రచారం చేస్తుండటాన్ని ముస్లిం వర్గాలు విమర్శిస్తున్నాయి. ఈ నెలలో పగటిపూట ఆహారం, పానీయాల వ్యాపారాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరచివుంచాలని, కమ్యూనిస్టు పార్టీ సభ్యులు, పోలీసులు, ఉద్యోగులు, విద్యార్థులు, చిన్నారులు ఉపవాసాలు చేయరాదని, మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనరాదని ఈ నోటీసుల్లో ఉంది.

  • Loading...

More Telugu News