: మోదీ, ఒబామాల బంధం ఇష్టంలేని కాపురమే: న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం
భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఒబామా రెండోసారి ఆతిథ్యమిస్తున్న వేళ, వీరిద్దరి బంధం ఇష్టంలేని కాపురం వంటిదేనని ప్రముఖ దినపత్రిక 'న్యూయార్క్ టైమ్స్' సంచలన కథనాన్ని ప్రచురించింది. "మోదీతో ఉన్న స్నేహబంధం కన్నా, ఒబామా మిగతా కొన్ని ప్రపంచ దేశాల అధినేతలతోనే దగ్గరి సంబంధాలు కలిగివున్నారు. రెండు దేశాలూ తమ బంధం పటిష్ఠం చేసుకునేందుకే చూస్తున్నాయి. చైనా ఎదుగుదలను, ఆ దేశ సైన్యం సూపర్ పవర్ ను అడ్డుకునేందుకు మరో దేశం కనిపించక, ఆసియాలో భారత్ ను ఒబామా ప్రోత్సహిస్తున్నారు" అని పేర్కొంది. అమెరికా కంపెనీల పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోందని, ఇంకా ఇరు దేశాల మధ్య సంబంధాలు ఊహించినంత మెరుగుపడలేదని పేర్కొంది. ఒబామా మైనారిటీల సంక్షేమాన్ని కోరుతుంటే, మోదీ మాత్రం తన జీవితంలో అత్యధిక భాగం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంటి మత సంస్థతో కాలం గడిపారని వ్యాఖ్యానించింది. గుజరాత్ లో 2002లో జరిగిన మతకల్లోలాలను ప్రస్తావించింది. గ్రీన్ పీస్ వంటి ప్రభుత్వేతర సంస్థలను మూసేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది.