: కేంద్రంతో చంద్రబాబు విందు రాజకీయం!


నవ్యాంధ్రను ఆదుకునే విషయంలో మీన మేషాలు లెక్కిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని దారికి తెచ్చుకునే విషయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విందు రాజకీయాలకు తెర తీశారు. మొన్నటికి మొన్న ఏపీ కోటా నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు చంద్రబాబు విజయవాడలో విందు ఏర్పాటు చేశారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ విందు భేటీలో సురేశ్ ప్రభు నుంచి చంద్రబాబు ఆశించిన మేర ఫలితాన్ని రాబట్టినట్టే ఉన్నారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సురేశ్ ప్రభు... విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి పెద్దగా ఇబ్బందేమీ లేదని, అయితే విభజన చట్టంలో ఆ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పొందుపరచలేదని పేర్కొన్నారు. ఏదేమైనా విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు ఖాయమని ఆయన ప్రకటన చేశారు. ఇక రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టుల విషయంలో కూడా కొంతమేర కదలిక వచ్చింది. ఈ దశలో రెండేళ్ల ఎన్డీఏ పాలన ముగిసిన నేపథ్యంలో బీజేపీ నిర్వహిస్తున్న ‘వికాస్ పర్వ్’ సభలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడలో నేడు వికాస్ పర్వ్ సభకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాధాకృష్ణన్ లు నేడు విజయవాడకు వస్తున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో వీరు చంద్రబాబు ఇంటికి వెళ్లనున్నారు. కేంద్ర మంత్రులకు ఆంధ్రా స్టైల్ వంటకాలతో కడుపు నింపనున్న చంద్రబాబు... వారి శాఖలకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులను ప్రస్తావించనున్నారు. వెరసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడమే కాకుండా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాల కోసం చంద్రబాబు విందు రాజకీయాలకు తెర తీసి మెరుగైన ఫలితాలనే రాబడుతున్నారు.

  • Loading...

More Telugu News