: సచిన్, రెహ్మాన్ కూడా ఒలింపిక్స్ ఆడలేదు కదా?: విమర్శకులకు సల్మాన్ ప్రశ్న
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తనపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇచ్చాడు. రియో ఒలింపిక్స్ కు వెళ్లనున్న ఆటగాళ్లలో స్థైర్యం నింపేందుకు సల్మాన్ గుడ్ విల్ అంబాసిడర్ గా నియమితుడవడం, దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడం తెలిసిందే. వీటిపై సల్మాన్ మాట్లాడుతూ, తనతో పాటు గుడ్ విల్ అంబాసిడర్లుగా ఎంపికైన సచిన్, రెహ్మాన్ కూడా గతంలో ఒలింపిక్స్ కు ప్రాతినిధ్యం వహించలేదని, అలాంటప్పుడు తన ఎంపికపై అభ్యంతరం ఎందుకని ప్రశ్నించాడు. 'మీ ఒక్కరిపైనే క్రిమినల్ కేసులు ఉన్నాయి కదా?' అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, 'మన దేశంలో చాలా మంది నాయకుల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి కదా, మరి వాళ్లనే ఎందుకు ఎన్నుకుంటున్నారు?' అని ఆయన ప్రశ్నించారు. దేశం ముఖ్యమా? ఒలింపిక్స్ ముఖ్యమా? అని నిలదీసిన సల్మాన్, "కొంత మంది నేతలపై రౌడీ షీట్లు, ఇంకొందరిపై అత్యాచారాలు, అత్యాచార యత్నాల కేసులు, ఇంకొందరిపై దోపిడీ కేసులు, మరి కొందరిపై హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాప్ కేసులు... ఇలా చాలా ఉన్నాయి. అయినా వారంతా నాయకులుగా కొనసాగడం లేదా?" అని ప్రశ్నించారు.