: కోదండరాం ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో చెప్పాలి!: మంత్రి లక్ష్మారెడ్డి
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండ రామ్, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పాలనలో వైఫల్యం చెందుతోందంటూ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు తిప్పికొడుతున్నారు. కోదండ రామ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి కోదండ రామ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేసీఆర్ అమలు పరుస్తోన్న ప్రజా సంక్షేమ పథకాలను కోదండ రామ్ గమనించాలని ఆయన సూచించారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి తమ ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం కృషి చేస్తోందని, అటువంటి తమపై విమర్శలు గుప్పించడంలో ఉద్దేశం ఏంటని ఆయన కోదండ రామ్‌ని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేని ప్రజా ప్రయోజన పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన పునరుద్ఘాటించారు. ఎవరి ప్రయోజనాల కోసం తాను మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలని కోదండ రామ్‌ను లక్ష్మారెడ్డి ప్రశ్నించారు.