: పాల్వాయి, సర్వేలు లీడర్లను తిట్టలేదా? నాకే నోటీసులేంటి?: కోమటిరెడ్డి
మాజీ టీఎస్ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కన్నా ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతగాని వాడంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ, గతంలో పాల్వాయి గోవర్థన్ రెడ్డి, సర్వే సత్యనారాయణ వంటి వారెందరో కాంగ్రెస్ లీడర్లను తిట్టారని గుర్తు చేస్తూ, వారికి షోకాజ్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఓ మహాసముద్రం వంటిదని, ఇటువంటి విషయాలు సర్వసాధారణమని అన్నారు. నోటీసుకు తాను సమాధానం పంపుతానని స్పష్టం చేశారు. కాగా, కోమటిరెడ్డి త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.