: డ్రగ్ డీలర్స్ను ప్రజలే కాల్చిపారేయండి లేదా కొట్టి చంపేయండి: ఫిలిప్పీన్స్ కొత్త అధ్యక్షుడు
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన రోడ్రిగో డ్యూటర్టీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మత్తు పదార్థాల దొంగ రవాణాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆయన.. ఈ చర్యలకు పాల్పడుతోన్న వారిని కాల్చిపారేయండని వ్యాఖ్యానించారు. మత్తు పదార్థాల దొంగ రవాణాను వ్యతిరేకిస్తోన్న వారికి తాను ఓ అభిమానినని ఆయన అన్నారు. డ్రగ్స్ ను సరఫరా చేసే వారు పోలీసులకి పట్టుబడి, అరెస్టుకి సహకరించకపోతే ప్రజలే వారిని కాల్చి పారేయాలని, లేదంటే కొట్టి అక్కడికక్కడే చంపేయాని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ ను అరికట్టే క్రమంలో ప్రజలు తమకు సహకరించాలని రోడ్రిగో డ్యూటర్టీ కోరారు. మీ దగ్గర తుపాకీ ఉంటే దానితో వారిని కాల్చి చంపేయండని ఆయన ప్రజలకు చెప్పారు. లేదంటే డ్రగ్స్ సరఫరా చేస్తోన్న వారి సమాచారాన్ని పోలీసులకి అందించాలని ఆయన కోరారు. అంతేకాదు మత్తు పదార్థాల బారిన పడి దానిలో మునిగి ఉండే వారిని చంపేస్తానని కూడా ఆయన అన్నారు. ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.