: రిటర్న్ పాలసీని మార్చిన ఫ్లిప్ కార్ట్


ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తన రిటర్న్ పాలసీని మారుస్తున్నట్టు ప్రకటించింది. తమ వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేసే టాప్ ప్రొడక్టులు నచ్చకుంటే, వినియోగదారులు 30 రోజుల్లోగా దాన్ని వెనక్కు ఇచ్చే అవకాశం ఉండగా, దాన్ని 10 రోజులకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మార్పు 20వ తేదీ నుంచి అమలవుతుందని స్పష్టం చేసింది. ఫ్లిప్ కార్ట్ నుంచి కొనుగోలు చేసిన వస్తువు తిరిగి వెనక్కు ఇవ్వాలనుకుంటే, ఏ ప్రశ్నా వేయకుండా తిరిగి డబ్బు చెల్లిస్తున్నందున అమ్మకందారులకు అదనపు నిర్వహణా ఖర్చుల భారం పెరుగుతోందని, వస్తువులు వాడుకుని, వాటిని తిరిగి ఇస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో పాలసీని మార్చామని తెలిపింది. ఇటీవలే అమేజాన్ సైతం తన రిటర్న్ పాలసీని మార్చిన సంగతి తెలిసిందే. కాగా, ఫ్లిప్ కార్ట్ మాధ్యమంగా అమ్మకాలు సాగించే ఉత్పత్తుల ధరలను 9 శాతం వరకూ పెంచుతున్నట్టు అమ్మకందారులు తెలిపారు. ఎలక్ట్రానిక్స్, బుక్స్, మొబైల్ ఫోన్లు తదితరాలపై కొత్త రిటర్న్ పాలసీ వర్తిస్తుందని తెలిపారు. ఈ నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుందన్నది జూలైలోనే తమకు తెలుస్తుందని భావిస్తున్నట్టు ఫ్లిప్ కార్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. మారిన విధానం ద్వారా అమ్మకందారుల వ్యాపారం మరింతగా పెరుగుతుందని భావిస్తున్నట్టు వివరించింది. తామిచ్చే కమిషన్, ఫీజుల విధానం ఇతర ఈ-కామర్స్ కంపెనీలతో పోటీ పడుతోందని, లావాదేవీలు పారదర్శకంగా సాగుతున్నాయని పేర్కొంది.

  • Loading...

More Telugu News