: హైదరాబాదులో స్తంభించిన న్యాయ వ్యవస్థ!... అన్ని కోర్టుల్లో విధులు బహిష్కరించిన టీ అడ్వొకేట్లు!
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో నేటి ఉదయం నుంచి న్యాయ వ్యవస్థ స్తంభించిపోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కావాలన్న డిమాండ్ చాలా కాలం నుంచే వినిపిస్తోంది. హైకోర్టులో ఏపీకి చెందిన న్యాయమూర్తుల సంఖ్య అధికంగా ఉండటంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలంగాణ వాదులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రత్యేక హైకోర్టు జాప్యాన్ని నిరసిస్తూ, మార్గదర్శకాలకు విడుద్ధంగా జరుగుతున్న న్యాయమూర్తుల కేటాయింపులను ఆపాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ నేటి నుంచి వరుస ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాదు పరిధిలోని అన్ని కోర్టుల్లో విధులను బహిష్కరించిన తెలంగాణ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఏపీకి చెందిన న్యాయమూర్తులు తక్షణం హైదరాబాదు నుంచి వెళ్లిపోవాలని న్యాయవాదులు చేస్తున్న నినాదాలు ఆయా కోర్టుల పరిధిలో హోరెత్తుతున్నాయి.