: హైదరాబాద్ వదలడం ఇష్టం లేకనే ఏపీ ఉద్యోగుల పేచీలు!
హైదరాబాద్... సకల సౌకర్యాలూ నెలకొన్న మహానగరం. అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది, మంచి ఉపాధి అవకాశాలు దగ్గర చేస్తున్న సందర నగరం కూడా. అటువంటి నగరాన్ని వదిలి వెళ్లడం ఎవరికైనా ఇష్టం ఉండదు. అది కూడా ఎలాంటి సౌకర్యాలూ లేని, ఇప్పుడే నిర్మాణం మొదలైన ప్రాంతానికి వెళ్లాలంటే... ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పరిస్థితి ఇదే. 27 నాటికి నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి తరలి వెళ్లాల్సిన ఉద్యోగులు మౌలిక వసతులు లేవంటూ, సదుపాయాలు బాగాలేవంటూ వారు పెడుతున్న మడతపేచీలు ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పిస్తుండటానికి అసలు కారణం హైదరాబాద్ పై మక్కువను చంపుకోలేకపోవడమే. అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. 27లోగా పూర్తవుతాయన్న నమ్మకాలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. ఎందుకంటే, గత వారం రోజుల్లో పనులు జరిగింది మూడు రోజులు మాత్రమే. మిగతా నాలుగు రోజుల్లో వర్షాల కారణంగా పనులు నిలిచిపోయాయి. ఇక రుతుపవనాలు వస్తే, 27లోగా కనీసం మరో వారం పది రోజుల పని నిలుస్తుంది. కేవలం రెండంతస్తుల శ్లాబ్ మినహా మరేమీ అమరావతిలో కనిపించడం లేదు. గోడలు, అంతర్గత నిర్మాణాలు, నీటి వసతి, డ్రయినేజ్ తదితరాల కల్పనకు కేవలం 20 రోజుల వ్యవధి ఎంతమాత్రమూ సరిపడదన్నది ఉద్యోగ సంఘాల వాదన. ఇక, ఈ నెల 27 డెడ్ లైన్ అంటూ చంద్రబాబు సర్కారు, ఉద్యోగులను మానసికంగా ఎప్పుడో సిద్ధం చేసినప్పటికీ, తాజా పరిస్థితులు ప్రభుత్వానికి ఇబ్బందులను తెచ్చి పెడుతున్నాయి. నిజంగా ఉద్యోగులందరినీ విజయవాడకు తీసుకువెళ్తే, వారందరినీ ఎక్కడ కూర్చోబెట్టాలన్న ప్రశ్నకు సమాధానం ఇంతవరకూ రాలేదు. ఎన్నో విభాగాలను నిర్వహించేందుకు అవసరమైన భవనాల లీజు ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. ఉద్యోగుల తరలింపును మరో నెల రోజులు పొడిగిస్తే, ఆపై పిల్లల చదువులంటూ, వారిని కళాశాలల్లో, స్కూళ్లలో చేర్పించేశామంటూ, కొత్త సమస్యను ఉద్యోగులు చూపిస్తారన్నది ప్రభుత్వ అధికారుల వాదన. అందుకే ఈ నెలాఖరులోగా తరలింపు జరిగిపోవాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉండగా, ఈ యేటికి ఇక్కడే గడిపేసి, వచ్చే సంవత్సరం చూసుకుందామన్నది ఉద్యోగుల ఆలోచనగా తెలుస్తోంది.