: మురళీకృష్ణ మాట మార్చలేదు!... అయితే రోడ్ మ్యాప్ కావాలని డిమాండ్!


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి ఉద్యోగుల తరలింపునకు సంబంధించి ఏపీ ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య అంతకంతకూ అంతరం పెరుగుతోంది. ఈ వ్యవహారంలో నిన్నటిదాకా అటు ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్ బాబు, ఇటు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ... ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. అయితే నిన్నటికి నిన్న అశోక్ బాబు మాట మార్చేశారు. ఉద్యోగులకు సంబంధించిన అన్ని మౌలిక వసతులు ఏర్పాటైతే తప్పించి తాము హైదరాబాదు వదిలేది లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం మురళీకృష్ణ హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వాదనను వినిపించారు. ప్రభుత్వ ఆదేశం మేరకు తాము అమరావతికి తరలివచ్చేందుకు సిద్ధంగానే ఉన్నామని ఆయన ప్రకటించారు. అయితే ఉద్యోగుల తరలింపునకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. విడతలవారీ తరలింపులో భాగంగా నెలా, రెండు నెలల్లో పూర్తి స్థాయిలో అక్కడికి తరలివెళతామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News