: మేమూ మనుషులమే!... మాకూ కుటుంబాలున్నాయి!: ప్లకార్డులు పట్టిన ఏపీ సచివాలయ ఉద్యోగులు
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి ఉద్యోగుల తరలింపు వ్యవహారం పెను వివాదంగానే మారే అవకాశాలున్నాయి. అమరావతి పరిధిలోని వెలగపూడిలో తాత్కాలిక రాజధాని పనులు శరవేగంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 27 నాటికి పనులు పూర్తి కానున్నాయని ఇప్పటికే మంత్రి నారాయణ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులంతా ఈ నెల 27లోగా అమరావతికి తరలిరావాల్సిందేనని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. నిన్నటిదాకా అమరావతికి తరలివచ్చేందుకు సిద్ధమేనన్న ఉద్యోగులు తీరా గడువు సమీపిస్తున్న నేపథ్యంలో మాట మార్చేశారు. అమరావతిలో పూర్తి స్థాయి మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చిన తర్వాతే తాము అమరావతికి వస్తామని చెబుతున్నారు. ఈ మేరకు నిన్నటి నుంచి ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య అంతరం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. కొద్దిసేపటి క్రితం సీఎం చంద్రబాబు తాత్కాలిక సచివాలయం పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మరోవైపు ఉద్యోగులు ప్రభుత్వ వైఖరిపై నిరసనలు వెళ్లగక్కుతూ నిరసన బాట పట్టారు. ఈ మేరకు ఉద్యోగులు ప్లకార్లులు చేతబట్టి నిరసనకు దిగారు. సదరు ప్లకార్డుల్లో ఉద్యోగులు ఆసక్తికర నినాదాలు రాశారు. ‘మేమూ మనుషులమే. మాకూ కుటుంబాలున్నాయి’, ‘విడతలవారీగా తరలింపు’, ‘రోడ్ మ్యాప్ ఎప్పుడు ఇస్తారు’ అంటూ రాసి ఉన్న సదరు ప్లకార్డులను పట్టుకుని నిరసన తెలుపుతున్న ఉద్యోగులు మౌనంగానే తన ఆవేదనను ప్రభుత్వానికి తెలిపేందుకు యత్నిస్తున్నారు.