: తీగ లాగుతున్న ఢిల్లీ పోలీసులు, కదులుతున్న అపోలో డొంక!


ఎంతో ప్రతిష్ఠాత్మకమైన అపోలో ఆసుపత్రుల్లో జరిగిన కిడ్నీ రాకెట్ ను ఢిల్లీ పోలీసులు సవాలుగా తీసుకుని విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే అపోలో గ్రూపుకు చెందిన ఐదు ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు, మరిన్ని ఆసుపత్రుల్లోనూ ఇదే తరహాలో కిడ్నీల మార్పిడి జరిగిందని అనుమానిస్తూ, నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రుల్లో జరిగిన అన్ని కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకు సంబంధించిన రికార్డులన్నీ తమకు సమర్పించాలని ఈ నోటీసుల్లో ఆదేశించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. సీఆర్పీసీ 160, 190 సెక్షన్ల కింద నోటీసులను ఇచ్చిన వారు, మొత్తం రాకెట్ లో సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కుమార్ ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఢిల్లీతో పాటు జలంధర్, కోయంబత్తూర్, పశ్చిమ బెంగాల్ లోని అపోలో ఆసుపత్రులతో సంబంధాలు పెట్టుకున్న రాజ్ కుమార్, సంపన్నులకు, విదేశీయులకూ కిడ్నీలను సరఫరా చేశాడని, అందుకు అపోలో వైద్యులు తమ వంతు సహకారాన్ని అందించారని పోలీసులు భావిస్తున్నారు. పేదరికాన్ని ఆసరాగా తీసుకుని, పేదలకు మాయమాటలు చెప్పి ఈ రాకెట్ ను నడుపుతున్నట్టు ఢిల్లీ పోలీసు వర్గాలు చెప్పాయి. అపోలో గ్రూప్ లోని ఆసుపత్రులతో పాటు, పలు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆసుపత్రులతో రాజ్ కుమార్ కు లింకులున్నట్టు తెలుస్తోంది. ఇక పోలీసులు లాగుతున్న ఈ కిడ్నీ రాకెట్ తీగతో, అపోలోతో పాటు మరిన్ని ఆసుపత్రుల డొంక కదలనుందని తెలుస్తోంది. ఇదిలావుండగా, ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ లో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో కిడ్నీని రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షలకు అమ్ముకుంటున్నారు. కిడ్నీ ఇచ్చిన వ్యక్తికి అందులో 10 శాతంగా, అంటే కేవలం రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకూ మాత్రమే రాజ్ కుమార్ చెల్లిస్తున్నాడు. ఆపరేషన్ చేసిన డాక్టర్ కు, పేదలకు డబ్బాశచూపి, వారిని కిడ్నీ దానానికి ఒప్పించే వారికి కూడా వాటా ఉంటుంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోని ఆసుపత్రులతో రాజ్ కుమార్ కు సంబంధాలున్నాయి. ఎవరైనా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కు వస్తే, కిడ్నీ కోసం రాజ్ కుమార్ ను సంప్రదించాలని స్వయంగా డాక్టర్లే సలహా ఇచ్చేవారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రాజ్ కుమార్ ను అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు, రాకెట్ వెనకున్న పెద్ద తలకాయలూ బయటకు రావచ్చు.

  • Loading...

More Telugu News