: ఉమా భారతి 'హీరో' సుబ్రహ్మణ్య స్వామి!... కేంద్ర మంత్రి ఆసక్తికర ప్రకటన!
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి నిన్న ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న బీజేపీ కీలక నేత, ఇటీవలే ఆ పార్టీ తరఫున రాజ్యసభలో అడుగుపెట్టిన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఉమా భారతి చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కాయి. అసలు ఆమె చేసిన వ్యాఖ్యలేమిటంటే... ‘‘సుబ్రహ్మణ్య స్వామి నా హీరో. అందుకే ఆయన ఏం చెబితే దానిని నేను విశ్వసిస్తాను. అయోధ్యలో రామమందిరం నిర్మాణ పనులు ఈ ఏడాది చివరినాటికల్లా ప్రారంభమవుతాయన్న ఆయన మాటలను నమ్ముతున్నాను. దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా ఉన్న ఈ వివాదం చర్చల ద్వారానే పరిష్కారం అవుతుంది. ఆ పరిష్కారం కూడా అద్భుతంగా ఉంటుంది. అయోధ్యలో అత్యద్భుత రామాలయాన్ని నిర్మిస్తాం’’ అని ఉమా భారతి పేర్కొన్నారు.