: ప్రత్తిపాటి పుల్లారావు పేరు చెప్పి రూ. 50 లక్షలు నొక్కేసిన ఘనుడు
విజయవాడలో మరో ఘరానామోసం బయటపడింది. మంత్రి ఇంటిపేరు, తన ఇంటిపేరు ఒకటేనన్న విషయాన్ని అవకాశంగా తీసుకున్న ఓ ఘనుడు, నిరుద్యోగుల నుంచి ఏకంగా రూ. 50 లక్షలు నొక్కేశాడు. విజయవాడలోని నున్న పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొందరు యువకులను ప్రత్తిపాటి సతీశ్ అనే వ్యక్తి కలిశాడు. తాను ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బంధువునని చెప్పి ఆయనతో కలిసి దిగిన ఫోటోలను చూపించాడు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అందుకు లంచంగా రూ. 50 లక్షలు బేరమాడుకున్నాడు. సతీశ్ మంత్రి బంధువేనని నమ్మిన నిరుద్యోగులు ఆ డబ్బును ఇవ్వగా, అప్పటి నుంచి సతీశ్ కనిపించలేదు. తాము మోసపోయినట్టు గమనించిన యువకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.