: ఆశించిన ఫలితాలు రాలేదు, ఇక తప్పుకోండి: కేసీఆర్ పై విరుచుకుపడ్డ కోదండరామ్


రెండేళ్ల కేసీఆర్ సర్కారు పాలన తమకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోందని, చేతకాకుంటే, తప్పుకోవాలని, అభివృద్ధిని తాము చేసి చూపిస్తామని జేఏసీ చైర్మన్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. 'రెండేళ్ల తెలంగాణ - ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వ తీరుతెన్నులు' అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రజల బతుకులు బాగుపడలేదని, హైదరాబాద్ చుట్టూ తిరుగుతూ, జిల్లాలను వదిలేశారని కోదండరామ్ విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే కార్పొరేట్, కాంట్రాక్ట్, రియల్ ఎస్టేట్ కంపెనీలకు లాభం చేకూర్చేలా పాలన సాగుతోందని అన్నారు. వ్యవసాయాన్ని విస్మరించారని, అందువల్లే రైతుల ఆత్మహత్యలు ఆగలేదని అభిప్రాయపడ్డ కోదండరామ్, ప్రజలు బాగుండాలన్న కారణంగానే జేఏసీ ఇంకా పనిచేస్తోందని, లేకుంటే ఎప్పుడో టీఆర్ఎస్ లో జేఏసీని కలిపి ఉండేవారమని అన్నారు. ఎన్నికల్లో గెలుపునకు, పనితీరు బాగుందనడానికి సంబంధం లేదని, ప్రభుత్వంపై నమ్మకంతోనే ఓట్లు పడుతున్నాయని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. అంతా తమకు తెలుసునని కేసీఆర్, ఆయన మంత్రులు భావిస్తున్నారని, అది అవివేకమని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News