: మాట మార్చిన అశోక్ బాబు!... కుదరదంటున్న చంద్రబాబు!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలో రూపుదిద్దుకుంటున్న తాత్కాలిక సచివాలయం పనులు చివరి దశకు వచ్చేశాయి. ఇక ఈ నెల 27 నుంచి నవ్యాంధ్ర పరిపాలన అమరావతి నుంచే జరిగి తీరుతుందని సీఎం నారా చంద్రబాబునాయుడు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ నెల 27లోగా ఉద్యోగులు అమరావతికి తరలిరావాల్సిందేనని మంత్రి నారాయణ కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో నిన్నటిదాకా ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలిచిన ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్ బాబు... నిన్న మాట మార్చేశారు. నిరసన గళం వినిపించారు. కనీస మౌలిక సదుపాయాలు లేకుండా రాజధానికి ఎలా వస్తామంటూ ఆయన చేసిన ప్రకటన ఏపీలో కలకలం రేపుతోంది. అవసరమైన మౌలిక వసతులన్నింటినీ ఏర్పాటు చేసిన తర్వాతే తాము అమరావతికి వస్తామంటూ ఆయన తేల్చిచెప్పేశారు. అయితే అదే సమయంలో అశోక్ బాబు వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటరిచ్చారు. నిన్న హైదరాబాదులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా... ఈ నెల 27లోగా ఉద్యోగులంతా అమరావతికి తరలిరావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. వెరసి అశోక్ బాబు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు... ఉద్యోగులకు వార్నింగే ఇచ్చారు. మరి 27 నాటికి ఉద్యోగులు అమరావతికి తరలివస్తారా? లేదా? అనే విషయంపై ఆసక్తి నెలకొంది.