: ఈడీకి షాకిచ్చిన ఇంటర్ పోల్!... మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులకు మరింత సమాచారం కావాలని లేఖ!
బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల రుణాన్ని ఎగవేసి విదేశాలకు చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను దేశానికి రప్పించేందుకు రంగంలోకి దిగిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మాల్యాను తమకు అప్పగించాలన్న ఈడీ వినతికి ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం నో చెప్పేసింది. తమ దేశ చట్టాల ప్రకారం మాల్యాను అప్పగించలేమన్న బ్రిటన్ వాదనతో షాక్ తిన్న ఈడీ... ఆ తర్వాత ఇంటర్ పోల్ ను ఆశ్రయించింది. తమ దేశ బ్యాంకులను నట్టేట ముంచిన మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇటీవలే ఈడీ... ఇంటర్ పోల్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖను సాంతం పరిశీలించిన ఇంటర్ పోల్... వెనువెంటనే మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు ససేమిరా అంది. అలా చేయాలంటే తమకు మరింత సమాచారం కావాలని ఆ సంస్థ ఇటీవలే ఈడీకి ఓ లేఖ రాసింది. ఈ లేఖకు ఈడీ స్పందిస్తే తప్పించి మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యే అవకాశాలు లేవు. అయితే ఈ నోటీసులపై ఈడీకి చెందిన అధికారులు మరో వాదన వినిపిస్తున్నారు. ఇంటర్ పోల్ మరింత సమాచారం కోరిన మాట వాస్తవమేనని చెప్పిన ఈడీ... ఈ లేఖ తమకు ఎదురుదెబ్బేమీ కాదని చెబుతోంది. పలు కేసుల్లో ఇంటర్ పోల్ సమగ్ర సమాచారం కోరడం సర్వసాధారణమేనని, ఆ క్రమంలోనే ఈడీ... మాల్యా కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని అడిగిందని చెప్పింది. ఇంటర్ పోల్ లేఖకు త్వరలోనే సమాధానం ఇవ్వనున్నామని, ఆ తర్వాత మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అవుతాయని ఈడీ ధీమాగా ఉంది.