: ముంబైలో నాలుగు నెలల నుంచి లైసెన్స్ లేకుండా నడుస్తున్న ఎయిర్ పోర్టు
రోజుకు సుమారు 100 విమానాల రాకపోకలను నియంత్రిస్తూ, ఇండియాలో అత్యంత బిజీగా ఉండే ఎయిర్ పోర్టుగా ఉన్న జుహూ విమానాశ్రయం గత నాలుగు నెలలుగా లైసెన్స్ లేకుండానే నడుస్తోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జుహూ విమానాశ్రయం లైసెన్స్ కాలపరిమితి ముగియగా, ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఇంకా అనుమతులను పునరుద్ధరించుకోలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఏఏఐ అధీనంలోనే ఈ ఎయిర్ పోర్టు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమానాశ్రయం నుంచి ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లు టేకాఫ్ అవుతూ ఉంటాయి. లైసెన్స్ లేకుండా విమానాశ్రయాన్ని నడిపేందుకు డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఎలా అనుమతిస్తోందని, దీనివల్ల ఎయిర్ సేఫ్టీ రిస్క్ పెరుగుతోందని అధికారులు విమర్శిస్తున్నారు. కాగా, తాము లైసెన్స్ ఎక్స్ పైర్ కాకముందే, జనవరిలో రెన్యువల్ డాక్యుమెంట్లు పంపామని ఏఏఐ అధికారి ఒకరు తెలిపారు. అనుమతుల పునరుద్ధరణ జరుగుతోందని జుహూ ఎయిర్ పోర్టు డైరెక్టర్ ఎంకే బిమాల్ వివరించారు.