: ఇవేమి రోడ్లు... నిత్యం ఎలా తిరుగుతున్నారు?: గవర్నర్ నరసింహన్
"యంగ్ గా కనిపిస్తున్నావు. ఇవేమి రోడ్లు... ఒక్క రోజు వస్తేనే నాకు ఎంతో ఇబ్బంది కలిగింది. రోజూ మీరు ఎలా ప్రయాణిస్తున్నారు? పనిలో దూసుకు వెళ్లాలి. మరో నెలలో వస్తాను. ఈలోగా కొత్త రోడ్లు వేయండి" హైదరాబాదు, యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన 'వికాస్ పర్వ్'కు వచ్చిన గవర్నర్ నరసింహన్, యూసఫ్ గూడ రహదార్లపై అక్కడి కార్పొరేటర్ సంజయ్ గౌడ్ తో చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇవసలు రహదారులేనా? ఎలా ప్రయాణిస్తున్నారు? అని గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేయగా, తాను పలుమార్లు ఫిర్యాదు చేశానని, మెట్రో పనులు ముగిసేవరకూ కొత్త రోడ్ల నిర్మాణం సాధ్యం కాదన్న సమాధానం వస్తోందని సంజయ్ వివరించారు. మెట్రో పని ముగియగానే రోడ్ల నిర్మాణం జరుగుతుందని చెప్పగా, అంత ఆలస్యం చేయవద్దని గవర్నర్ సలహా ఇచ్చారు. వీరి సంభాషణను కేంద్ర మంత్రి దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు ఆసక్తిగా విన్నారు.