: పూటుగా మందుకొట్టి పట్టుబడ్డ 'కాయ్ రాజా కాయ్' హీరో సాయి రోహిత్
హైదరాబాదు, జూబ్లీహిల్స్ లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తుండగా, 'కాయ్ రాజా కాయ్' చిత్ర హీరో సాయి రోహిత్ పూటుగా మద్యం సేవించి వాహనం నడుపుతూ వచ్చి పట్టుబడ్డాడు. ఏపీ 09 బీవీ 8045 నంబరుగల కారులో వచ్చిన రోహిత్, మోతాదుకు మించి 42 శాతం అధిక మద్యం తాగినట్టు పోలీసులు వెల్లడించారు. గత రాత్రి చెక్ పోస్టు, క్యాన్సర్ హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి ఒంటిగంట వరకూ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా, పలువురు వాహన దారులు మోతాదుకు మించిన స్థాయిలో మద్యం సేవించి పట్టుబడ్డారు. సాయి రోహిత్ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆయనపై కేసు నమోదు చేశారు. రోహిత్ కు కౌన్సెలింగ్ నిర్వహించి కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నట్టు వివరించారు. అధిక వేగంతో వస్తున్న యువ బైకర్లను సైతం అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వీరికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తామని పేర్కొన్నారు.