: చట్టానికి విరుద్ధంగా కృష్ణా రివర్ బోర్డ్ ప్రవర్తిస్తోంది.. ఫిర్యాదు చేసి తీరుతాం: హరీశ్‌రావు
చట్టానికి విరుద్ధంగా కృష్ణా రివర్ బోర్డ్ ప్రవర్తిస్తోందని ఈ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేసి తీరుతామని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఈరోజు తెలిపారు. తన ఢిల్లీ పర్యటన సోమవారానికి వాయిదా పడిన అనంతరం ఓ టీవీ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కృష్ణా రివర్ బోర్డ్ ఏక పక్షంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఏకపక్ష ధోరణిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. కేంద్రం దృష్టికి కూడా సోమవారం తీసుకెళ్లనున్నామని ఆయన చెప్పారు. కృష్ణారివర్ బోర్డ్ ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఢిల్లీలో కేంద్ర మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేయనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. కృష్ణా రివర్ పై కేంద్రం జోక్యం చేసుకోవాలని అన్నారు. ప్రాజెక్టులను కేటాయించాల్సింది ట్రైబ్యునల్ అని, కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. బోర్డు తన పరిధిని అతిక్రమిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.