: 26 కోట్లు కావాలట... భిక్షమడుగుతున్న నిరుద్యోగి!
సాధారణంగా రోడ్ల కూడళ్లలో రూపాయో, పది రూపాయలో అడుక్కునే వారిని చూస్తూ ఉంటాము. కానీ సౌతాఫ్రికాలో డెస్మండ్ అనే గ్రాడ్యుయేట్ మాత్రం కాస్త డిఫరెంట్. అందుకే, తనకు కోట్లు కావాలని అడుక్కుంటున్నాడు. విద్య పూర్తికాగానే ఉద్యోగం కోసం ప్రయత్నించాడు, రాలేదు. వ్యాపారం చేద్దామనుకున్నాడు, డబ్బుల్లేవు. నిధుల కోసం లోన్ సంపాదించేందుకు బ్యాంకుల చుట్టూ తిరిగాడు. అయితే, ష్యూరిటీ కావాలని, ఆ పత్రాలు, ఈ పత్రాలు ఇవ్వండని తిప్పించుకున్నాయి. ఫలితంగా చెప్పులు అరిగాయితప్ప లోన్ మాత్రం శాంక్షన్ కాలేదు. దీంతో ప్రభుత్వ సాయం కోసం అర్జీలు పెట్టుకున్నాడు. అయినా ఫలితం లేదు. ఇక లాభం లేదని, ఇప్పుడు రోడ్లపై పడ్డాడు. తనకు 60 మిలియన్ ర్యాండ్లు (సుమారు 26 కోట్ల 32 లక్షల రూపాయలు) కావాలని ప్లకార్డు పట్టుకుని అడుక్కుంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపారావకాశాలు, అందిస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం, వాటిని నమ్మిన తమలాంటి వారిని మోసం చేసిందని ఆరోపిస్తున్నాడు. త్వరలో రాజధాని ప్రిటోరియాలోని యూనియన్ బిల్డింగ్ ముందు ఆందోళన కార్యక్రమాన్ని చేబడతానని డెస్మండ్ పేర్కొంటున్నాడు.