: టీడీపీ వైపు మాజీ మంత్రి డీఎల్ చూపు!... కడపలో ఆసక్తికర రాజకీయం!


డీఎల్ రవీంద్రారెడ్డి... తెలుగు నేలలో పరిచయం అక్కరలేని నేత. ఫ్యాక్షన్ ఖిల్లా కడప జిల్లా నుంచి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన డీఎల్ రవీంద్రారెడ్డి... నాలుగు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా పనిచేసిన ఆయన... తన సొంత జిల్లా కడపకు చెందిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో మాత్రం బెర్తును దక్కించుకోలేకపోయారు. మంత్రిగా ఉన్నా... సర్కారు పథకాలపై ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడే తత్వమున్న డీఎల్... ఏం మాట్లాడినా సంచలనమే. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. తాను ఉంటున్న కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవంతో ఆయన దాదాపుగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు మొన్నటిదాకా ప్రచారం సాగింది. అయితే పూర్వాశ్రమంలో వైద్యుడిగా పనిచేసిన డీఎల్... తన సొంతూరు మైదుకూరు నుంచి 1978లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి తొలి యత్నంలోనే విజయం సాధించారు. ఇక 1983లో వీచిన ఎన్టీఆర్ గాలిలోనూ డీఎల్ విజయం సాధించి సత్తా చాటారు. అలాంటి నేత ఎక్కువ కాలం రాజకీయాలకు దూరంగా ఉండలేకపోయారు. మళ్లీ సరికొత్తగా రాజకీయ తెరంగేట్రం చేసేందుకు డీఎల్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు కడప జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వైఎస్ కుటుంబంతో అంతగా పొసగని డీఎల్ వైసీపీలోకి వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఉన్న ప్రత్యామ్నాయం టీడీపీ ఒక్కటే. ఆ పార్టీ వైపే డీఎల్ చూస్తున్నారంటూ ప్రచారం జోరందుకుంది. ఈ దిశగా డీఎల్ ఇప్పటికే తన యత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. అయితే గడచిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి మద్దతిస్తానని హామీ ఇచ్చిన డీఎల్ చివరి నిమిషంలో మాట మార్చేసి వైసీపీ అభ్యర్థికి సహకరించారట. దీంతో డీఎల్ ఎంట్రీని అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ మైదుకూరు నియోజకవర్గ ఇన్ చార్జీ సుధాకర్ యాదవ్ కూడా గట్టిగానే యత్నిస్తున్నారట. మరి డీఎల్ టీడీపీలో చేరతారా? మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలిలో ఆయన చక్రం తిప్పుతారా? అన్న ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుందని కడప వాసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News