: ఓ వైపు ఆందోళనలు.. మరోవైపు కదిరి నుంచి ప్రారంభమైన జగన్ రైతు భరోసా యాత్ర
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలతో అనంతపురంలోని కదిరిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఓ వైపు టీడీపీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తుంటే.. మరోవైపు మాత్రం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన ఐదోవిడత రైతు భరోసా యాత్ర ఈరోజు కదిరిలో ప్రారంభమయింది. కదిరిలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. కదిరి పోలీస్ స్టేషన్ ముందు టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. జగన్ యాత్రను జరగనివ్వబోమని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఉద్రిక్తత మధ్యే యాత్ర కొనసాగిస్తోన్న జగన్ మరికాసేపట్లో ఎన్‌పీ కుంట మండలంలో రైతులతో ముఖాముఖిలో మాట్లాడనున్నారు. సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతుల సమస్యలను జగన్ అడిగి తెలుసుకోనున్నారు.