: ప్రత్యేక విమానంలో ఆఫ్ఘన్‌కు బయలుదేరిన మోదీ.. ఐదు దేశాల పర్యటనకు శ్రీకారం
ప్రధాని నరేంద్ర మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు న్యూఢిల్లీ నుంచి ఆఫ్ఘనిస్థాన్‌కి బయలుదేరారు. ఈనెల 8 వరకు ఆయన విదేశీ పర్యటనల్లో ఆయా దేశాల అధ్యక్షులతో చర్చించనున్నారు. ఆఫ్ఘనిస్థాన్ పర్యటనలో భాగంగా మోదీ ఈరోజు ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో భేటీ అవుతారు. ఇరు దేశాధ్యక్షులు కలసి ఆఫ్ఘన్, ఇండియా ఫ్రెండ్‌షిప్ డ్యామ్(సల్మా డ్యామ్)ను ప్రారంభిస్తారు. అనంతరం మోదీ ఈరోజు సాయంత్రం ఆఫ్ఘన్ నుంచి ఖతర్ కు వెళ్లనున్నారు. ఆ దేశ ప్రధానితో పాటు, పలువురితో సమావేశమవుతారు. ఆ తరువాత ఖతర్ నుంచి స్విట్జర్లాండ్‌కి బయలు దేరుతారు. ఈనెల 6న స్విట్జర్లాండ్ నుంచి ఆయన అమెరికాలోని వాషింగ్టన్‌కు వెళ్తారు. అమెరికా పర్యటనలో భాగంగా ఈనెల 7న ఆ దేశాధ్యక్షునితో మోదీ భేటీ అవుతారు. అనంతరం అక్కడ అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగం చేస్తారు. ఆ తరువాత మోదీ ఈనెల 8న మెక్సికోలో పర్యటిస్తారు. మెక్సికోతో కీలకమైన ద్వైపాక్షిక అంశాలపై మోదీ ఆ దేశాధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటోతో భేటీ అవుతారు.