: ముసురు ఎఫెక్ట్!... ఎక్కడికక్కడే నిలిచిపోయిన విమానాలు!
నిన్న రాత్రి నుంచి కమ్మేసిన ముసురు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జన జీవనంపై పెను ప్రభావాన్నే చూపుతోంది. నిన్న సాయంత్రం నుంచి విడతలవారీగా కురుస్తున్న వర్షం కారణంగా వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, పలు ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయి. ఇక చాలా ప్రాంతాలకు రవాణా నిలిచిపోయింది. బలమైన ఈదురు గాలులు, కమ్మేసిన ముసురు కారణంగా ఆకాశయానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల టేకాఫ్ సాధ్యపడటం లేదు. దీంతో అక్కడ చాలా విమానాలు నిలిచిపోయాయి. ఇక విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గన్నవరం నుంచి నేటి ఉదయం బయలుదేరాల్సిన ఏ ఒక్క విమానం కూడా టేకాఫ్ తీసుకోలేదు. దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి కూడా విమానాల రాకపోకలు స్తంభించాయి.