: బాక్సింగ్ దిగ్గజానికి టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల నివాళి
బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ కన్నుమూత యావత్తు ప్రపంచాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. 12 ఏళ్ల వయసులోనే బాక్సింగ్ రింగ్ లోకి దూకేసిన అలీ 22 ఏళ్లకే వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ గా అవతరించాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు రింగ్ లో ప్రత్యర్థులకు చుక్కలు చూపిన అలీ మూడు పర్యాయాలు వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ గా నిలిచి యావత్తు క్రీడా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాడు. తీవ్ర అనారోగ్యంలో అమెరికాలోని ఫీనిక్స్ లోని ఓ ఆసుపత్రిలో చేరిన అలీ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. అలీ మరణవార్త క్రీడా ప్రపంచాన్నే కాకుండా సినీ జగత్తును కలచివేసింది. టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా ఆయన మృతికి సంతాపాలు వెల్లువెత్తాయి. బాలీవుడ్ చోటా బచ్చన్ అభిషేక్ బచ్చన్... అలీ మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశాడు. బాక్సింగ్ లెజెండ్ ఆత్మకు శాంతి చేకూరాలని అతడు కోరాడు. ఇక టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి కూడా అలీ మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశాడు. ఓ గొప్ప క్రీడాకారుడిని కోల్పోయామని అతడు ఆ సందేశంలో పేర్కొన్నాడు.