: ఐఓసీ సభ్యత్వానికి నామినేట్ అయిన నీతా అంబానీ!... భారత్ తరఫున తొలి మహిళగా రికార్డు!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ పేరిట ఓ క్రికెట్ జట్టును కొనుగోలు చేసిన నీతా... క్రీడలపై అమితాసక్తి కనబరుస్తున్నారు. తాజాగా ఆమె అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యత్వానికి భారత్ తరఫున నామినేట్ అయ్యారు. దీంతో ఆగస్టు 2 నుంచి 4 వరకు రియోడీజనిరోలో జరగనున్న ఐఓసీ సెషన్ ఎన్నికల్లో ఆమె బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో నీతా విజయం సాధిస్తే... ఐఓసీలో అడుగుపెట్టిన తొలి భారత మహిళా సభ్యురాలిగా రికార్డులకెక్కనున్నారు. ఎన్నికలో నీతా విజయం సాధిస్తే... ఆమెకు 70 ఏళ్లు వచ్చేదాకా అందులో సభ్యురాలిగా కొనసాగనున్నారు. ఐఓసీ సభ్యత్వానికి నామినేట్ అయిన విషయం తెలిసిన వెంటనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, అభినవ్ బింద్రా, మేరీకోమ్ తదితర క్రీడా ప్రముఖులు అభినందనలు తెలిపారు.