: మాల్యాకు డియాజియో మద్దతు!... 'గుడ్ విల్' విత్ డ్రాకు అనుమతించాలని పిటిషన్!
బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి లండన్ కు పారిపోయిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాకు మద్దతుగా ఆయన కంపెనీలను కొనుగోలు చేసిన డియాజియో సంస్థ రంగంలోకి దిగింది. తాము కొనుగోలు చేసిన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ చైర్మన్ పదవితో పాటు డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకున్న మాల్యాకు డియాజియో రూ.500 కోట్లను గుడ్ విల్ గా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే మాల్యా లండన్ చెక్కేసిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన బెంగళూరులోని డెబిట్ రికవరీ ట్రైబ్యూనల్ సదరు నిధులను బ్యాంకుల్లోనే ఫ్రీజ్ చేసింది. ఈ నిధులను విత్ డ్రా చేసుకునేందుకు మాల్యాకు అనుమతివ్వాలని డియాజియా నిన్న ట్రైబ్యూనల్ లో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తదుపరి విచారణను ట్రైబ్యూనల్ ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.