: వైఎస్ జగన్ అనుచిత వ్యాఖ్యల ఎఫెక్ట్!... ఒంగోలు నుంచి కడపకు మారిన ‘మహా సంకల్పం’!
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని చెప్పులతో కొట్టాలంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. చంద్రబాబు కేబినెట్ లోని మంత్రులతో పాటు టీడీపీ నేతలు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం హోదాలోని నేతను చెప్పులతో కొట్టాలంటారా? అంటూ నిన్న జగన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. జగన్ వ్యాఖ్యలు... సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు కూడా కారణమయ్యాయి. నవ నిర్మాణ దీక్షల ముగింపు సందర్భంగా ఈ నెల 8న ప్రకాశం జిల్లా ఒంగోలులో ‘మహా సంకల్పం’ పేరిట భారీ సభను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే జగన్ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో సదరు సభ జగన్ సొంత జిల్లా కడపకు మారిపోయింది. ఈ మేరకు నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రభుత్వం ‘మహా సంకల్పం’ వేదికను మారుస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అన్ని కార్యక్రమాలు విజయవాడ, దాని పరిసర ప్రాంతాల్లోనే జరిగితే రాయలసీమ ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయన్న భావనతోనే ఒంగోలు నుంచి ‘మహా సంకల్పం’ వేదికను కడపకు మార్చామని ప్రభుత్వం సదరు ఉత్తర్వుల్లో చెప్పింది. అయితే జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో ‘మహా సంకల్పం’ వేదికను కడపకు మార్చాలని సీఎంకు పెద్ద ఎత్తున వినతులు వెల్లువెత్తినట్లు విశ్వసనీయ సమాచారం. జగన్ వ్యాఖ్యలను తిప్పి కొట్టడమే కాకుండా జగన్ సొంత జిల్లాలోనే తమ సంకల్పం చెప్పుకోవాలన్న భావనతోనే టీడీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.