: ఆ నీరు 25 కోట్ల మందికి దాహం తీరుస్తుంది: గ్రీన్ పీస్ అధ్యయనం
దేశవ్యాప్తంగా తాగునీటి సమస్య ఏర్పడుతోంది. భూగర్భజలాలు అడుగంటుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లో కరవు కరాళనృత్యం చేస్తోంది. ఈ నేపధ్యంలో గ్రీన్ పీస్ ఏజెన్సీ చేపట్టిన అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. కేవలం ఏడు రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు పెట్టిన థర్మల్ పవర్ ప్లాంట్లకు సరఫరా చేస్తున్న నీటిని ప్రజలకు సరఫరా చేస్తే సుమారు ఐదు కోట్ల మంది ప్రజల తాగునీటి సమస్యలు తీరిపోతాయని ఆ సంస్థ తెలిపింది. అదే దేశవ్యాప్తంగా ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేసే నీటిని ప్రజలకు వినియోగిస్తే సుమారు 25.1 కోట్ల మంది తాగునీటి అవసరాలు తీర్చవచ్చని ఆ సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు సంవత్సరానికి 4.6 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని వినియోగిస్తున్నాయని గ్రీన్ పీస్ కార్యకర్తలు తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా కొన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలు నెలకొల్పాలనే భావనలో ఉందని వారు తెలిపారు. వాటిని కనుక ప్రారంభిస్తే, ఇప్పుడు వినియోగిస్తున్న నీటికి రెండు రెట్లు ఎక్కువ నీరు వినియోగించాల్సి వస్తుందని వారు వెల్లడించారు. అలా జరిగితే దేశంలో మరింత కరవు తాండవిస్తుందని, ఇక వాటర్ బాటిళ్ళను వేలాది రూపాయలు వెచ్చించి కొనుక్కోవలసి వస్తుందని గ్రీన్ పీస్ సంస్థ అభిప్రాయపడింది. కరవు పీడించినప్పుడు విద్యుదుత్పత్తికి అవసరమైన నీరు లేనప్పుడు మళ్లీ విద్యుత్ కేంద్రాలు మూసుకోకతప్పని పరిస్థితి నెలకొంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. హైడల్, థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థానంలో పవన, సౌర విద్యుదుత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని వారు సూచించారు.