: పాక్, బంగ్లాల నుంచి వలస వచ్చిన హిందువులకు శుభవార్త
పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల నుంచి వలస వచ్చి భారత్ లో స్థిరపడిన హిందువులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించనుంది. ఆయా దేశాలలోని ముస్లింల వేధింపులతో వేలాదిమంది భారత్ కు వలస వచ్చి వివిధ రాష్ట్రాల్లో స్ధిరపడే ప్రయత్నాలు చేస్తున్నారు. వారంతా భారత పౌరసత్వం కోసం పలు సందర్భాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. పరిమితి మేరకు మాత్రమే పౌరసత్వం ఇస్తుండడంతో అందరికీ అవకాశం లభించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల నుంచి వలస వచ్చిన హిందువులందరికీ భారత పౌరసత్వం కల్పించే దిశగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. 1955 పౌరసత్వ చట్టానికి సవరణలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇది అమలులోకి వస్తే, ఆ రెండు దేశాల నుంచి వలస వచ్చిన సుమారు 2 లక్షల మంది హిందువులు లబ్ధి పొందే వీలుంటుందని గణాంకాలు చెబుతున్నాయి.