: వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అతిపెద్ద తప్పుల్లో జగన్ ను సరిగా పెంచకపోవడం ఒకటి: సోమిరెడ్డి
వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అతిపెద్ద తప్పుల్లో తన కొడుకు జగన్ ని సరిగా పెంచకపోవడం ఒకటి అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కేసుల విచారణ పూర్తయితే ప్రజలు ఎవరిని కొడతారో తెలుస్తుందని, జగన్ పతనం ఇక ఆరంభమైందని ఆయన విరుచుకుపడ్డారు. 13 అవినీతి కేసుల్లో జగన్ ఏ1 ముద్దాయిగా ఉన్నారని, కేసుల విచారణ ఏడాదిలోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందనే విషయాన్ని సోమిరెడ్డి ప్రస్తావించారు. కాగా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై నిన్న జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న తాము, వైఎస్ రాజశేఖరరెడ్డిని అసభ్యపదజాలంతో ఎప్పుడైనా దూషించామా? అంటూ ఏపీ మంత్రి పరిటాల సునీత ఘాటుగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.