: మధుర జ్ఞాపకాలను అమ్మకానికి పెడుతున్న ఫుట్ బాల్ దిగ్గజం!
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ దిగ్గజం పీలే (75) తన అరుదైన జ్ఞాపకాలను వేలం వేసేందుకు సిద్ధమవుతున్నాడు. కోచ్ గా పనిచేయమంటూ వివిధ జట్లు ఆఫర్ ఇస్తున్నా, కోచ్ గా పని చేసేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్న పీలే... తన అరుదైన జ్ఞాపకాలైన జెర్సీలు, బూట్లు, వివిధ టోర్నీల్లో గెలుచుకున్న వ్యక్తిగత పతకాలను ఇప్పుడు అమ్మకానికి పెడుతున్నాడు. ఈ వస్తువులను వేలం వేయడం ద్వారా సుమారు 47 కోట్ల రూపాయలు సమకూరుతాయని అంచనా వేస్తున్నారు. కాగా, మూడు సార్లు ఫుట్ బాల్ వరల్డ్ కప్ ను సాధించిన పీలే (75) తన 15 ఏటనే ప్రొఫషనల్ క్రీడాకారుడిగా గుర్తింపుపొందాడు. 1956 లో ఫుట్ బాలర్ గా కెరీర్ ప్రారంభించిన పీలే 1977 వరకు ఆడారు. 2014లో గ్లోబల్ ఫుట్ బాల్ అంబాసిడర్ గా ఆయన సేవలందించారు. ఈ వేలం ద్వారా వచ్చే డబ్బులో కొంత మొత్తాన్ని బ్రెజిల్ లోని అతి పెద్దదైన 'పెకినో ప్రిన్సిపె' అనే పిల్లల ఆసుపత్రికి విరాళంగా ఇవ్వనున్నట్టు పీలే తెలిపాడు. అలాగే శాంటోస్ నగరంతో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని, కొంత భాగం వస్తువులను ఆ నగరానికి డొనేట్ చేస్తున్నట్టు, తన అభిమానులు, సేకరణకర్తలు వాటిని సొంతం చేసుకోవచ్చని పీలే తెలిపాడు. ఆ విధంగా ఆ జ్ఞాపికలను తమ వద్ద కలకాలం ఉంచుకుని, తమ పిల్లలకు, ముందు తరాలకు తన చరిత్రను తెలియజెప్పచ్చని అన్నాడు. ఈ వేలంలో పీలేకి చెందిన సుమారు 2,000 వస్తువులు వేలానికి రానున్నాయి. 7 సెప్టెంబర్ 1956 నుంచి 1 అక్టోబర్ 1977 మధ్య కాలంలో 1363 మ్యాచ్ ల ద్వారా సాధించిన 1279 గోల్స్ కు గుర్తుగా లభించిన గిన్నిస్ రికార్డు పత్రాన్ని కూడా ఈ వేలంలో ఉంచడం విశేషం. అలాగే మూడుసార్లు వరల్డ్ కప్ సాధించిన సందర్భంగా లభించిన పతకాలను కూడా ఆయన వేలంలో ఉంచనున్నారు. బ్రెజిల్ ఫుట్ బాల్ జట్టులో 10వ నెంబర్ జెర్సీకి ప్రత్యేకమైన గుర్తింపుతో పోటీ తెచ్చిన పీలే ఆ జెర్సీలను కూడా వేలం వేయనున్నాడు. వాటితోపాటు తనకు ఇష్టమైన సిల్వెస్టర్ స్టాలోన్, సర్ బాబీ మూర్ తో 1981లో నటించిన 'ఎస్కేప్ టు హిస్టరీ' సినిమాలో ధరించిన బూట్ల జతను కూడా ఆయన వేలం వేయనున్నారు. వీటన్నింటిలోకి అత్యంత ఖరీదైన ప్రపంచ కప్ ట్రోఫీలు ఎక్కువ ధర పలికే అవకాశం ఉందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేలంను బెవర్లీ హిల్స్ లోని జూలియన్స్ ఆక్షన్ హౌస్ చక్కబెట్టనుంది. కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచ ఫుట్ బాల్ లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన పీలే వస్తువులను ఈ నెల 6, 7, 8 తేదీలలో వేలం వేయనున్నారు. బిడ్ దక్కించుకోవాలంటే రిజిస్టర్ అయి ఉండాలని నిర్వాహకులు వెల్లడించారు. నేరుగా వచ్చినా లేదా ఫోన్ లో అయినా, అది కూడా వీలు కాకపోతే ఆన్ లైన్ ద్వారా కూడా వేలంలో పాల్గొనవచ్చని జూలియన్స్ ఆక్షన్ హౌస్ తెలిపింది.